Bumrah: ఇంగ్లాండ్ సిరీస్ కు బుమ్రా అనుమానమే! 1 d ago
వెన్ను నొప్పితో బాధపడుతున్న టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ తెల్ల బంతి సిరీస్‌లో చాలా మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది. తగిన విశ్రాంతితో ఫిబ్రవరి 19న ఆరంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి అతడు అందుబాటులో ఉండాలని టీమిండియా కోరుకుంటోంది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత జట్టు 1-3తో ఓడినప్పటికీ బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 32 వికెట్లతో అతడు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచాడు. అయితే వెన్ను గాయం కారణంగా సిరీస్ ఆఖరి ఇన్నింగ్స్‌లో అతడు బౌలింగ్ చేయలేకపోయాడు. 30 ఏళ్ల బుమ్రా ఆ సిరీస్‌లో 150కి పైగా ఓవర్లు వేశాడు. ఎక్కువ పనిభారమే అతడి వెన్ను నొప్పికి కారణమని భావిస్తున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి అతణ్ని సిద్ధం చేయడానికి బీసీసీఐ వైద్య బృందం ప్రయత్నించనుంది. ఆ టోర్నీలో భారత్ అవకాశాలకు బుమ్రా ఎంతో కీలకం. ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో పోరుతో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటను ఆరంభిస్తుంది. బుమ్రా వెన్ను నొప్పి తీవ్రతను ఇంకా అంచనా వేయలేదని సమాచారం. బుమ్రా గాయం గ్రేడ్ 1 విభాగంలో ఉంటే.. అతడు కోలుకోవడానికి కనీసం రెండు, మూడు వారాలు పడుతుంది. గ్రేడ్ 2 అయితే ఆరు వారాలు పట్టొచ్చు. అన్నింటి కన్నా తీవ్రమైన గ్రేడ్ 3 గాయమైతే విశ్రాంతి, పునరావాస కార్యక్రమానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. బుమ్రాకు అయిన గాయం తీవ్రత ఆధారంగా అతడు ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆడతాడా లేదా అన్నది తేలనుంది. స్వదేశంలో ఇంగ్లాండ్ తో భారత జట్టు అయిదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. జనవరి 22న ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టీ20తో భారత్‌లో ఇంగ్లాండ్ పర్యటన మొదలవుతుంది.